హైదరాబాద్, సెప్టెంబర్ 21: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు దసరా సెలవులు వచ్చేశాయి. అన్ని పాఠశాలలు శనివారం (సెప్టెంబర్ 20) నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో విద్యార్థులు ఫుల ఖుషీ అవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతోపాటు గురుకులాలు, ప్రైవేట్ రెసిడెన్సీల్లో ఉంటున్న విద్యార్థులు శనివారం నుంచే ఇంటి బాట పట్టారు. తల్లిదండ్రులు విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లడానికి వస్తుండటంతో పలు చోట్ల సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు బస్టాండులు, రైల్వే స్టేషన్లు విద్యార్థులతో కిక్కిరిసిపోయాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై రద్దీ నెలకొంది.

